మాజీ హోం మంత్రి ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి నిరసన
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానకి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఈ నియామకం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగుతుండగా.. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు నిరసనకు దిగారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని సుచరిత నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే శ్రీదేవి ఆందోళన విరమించారు. పార్టీ అధినేతతో మాట్లాడేందుకు తాడికొండ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 10 గంటల్లో పార్టీ అధిస్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నాలుగు మండలాల్లోని నాయకులం రాజీనామా చేస్తామని ప్రకటించారు.

