ప్రపంచానికి తప్పిన రేడియేషన్ ముప్పు
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించినప్పటి నుంచి ఏదోక విపత్తు ముంచుకొస్తూనే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అయితే.. తమ సిబ్బంది చొరవతో రేడియోధార్మిక విపత్తు నుంచి ప్రపంచం తృటిలో తప్పించుకుందని జెలెన్‌స్కీ తెలిపారు. ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ‘జపోరిజియా’కు కొన్నిగంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఈ ప్రమాదం ముంచుకొచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రష్యా దళాలు ప్లాంట్‌ను వీడేలా ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని జెలెన్‌స్కీ కోరారు. ‘ఉక్రెయిన్‌ను, ఐరోపా వాసులను రష్యా.. రేడియేషన్ విపత్తుకు ఒక అడుగు దూరంలో ఉంచింది. రష్యా దళాలు అణు విద్యుత్ కేంద్రంలో ఉన్న ప్రతి నిమిషం ప్రపంచానికి రేడియేషన్ ప్రమాదం పొంచి ఉంటుంది’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

‘రష్యా దాడుల కారణంగా గురువారం అణు ప్లాంట్‌కు సమీపంలోని ఓ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం యూనిట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పవర్‌గ్రిడ్ నుంచి జపోరిజియాకు విద్యుత్ సరఫరా అగిపోయింది. తమ సిబ్బంది బ్యాకప్ డీజిల్ జనరేటర్ల సాయంతో సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ప్లాంట్‌లోని శీతలీకరణ, ఇతర కీలక భద్రతా వ్యవస్థలు యథావిధిగా పనిచేశాయి. లేని పక్షంలో ఇప్పటికే రేడియేషన్ విపత్తు పరిణామాలను అధిగమించే చర్యలు తీసుకోవాల్సి వచ్చేదని జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా దళాల పర్యవేక్షణలో ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఉక్రెయిన్ సాంకేతిక నిపుణులను ఈ సందర్భంగా జెలెన్‌స్కీ ప్రశంసించారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ నుంచి ప్లాంట్ అవసరాలకు విద్యుత్ సరఫరా అవుతోందని, ప్లాంట్‌లో క్రియాశీలకంగా ఉన్న రెండు రియాక్టర్లకు గ్రిడ్ కనెక్షన్‌ను పునరుద్ధరించే పని కొనసాగుతోందని ఉక్రెయిన్‌కు చెందిన ఎనర్‌గో ఆటమ్ తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనకు ఉక్రెయిన్ సాయుధ దళాలే కారణమని రష్యా ఆరోపించింది. అత్యంత జాగ్రత్తతో నడపాల్సిన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం కొన్నాళ్లుగా రణరంగానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య తరచూ దాడులతో అణు విపత్తు భయం నెలకొంది. మరోవైపు.. తప్పు మీదంటే మీదంటూ ఇరుదేశాలు ఆరోపించుకుంటున్నాయి.

