వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల సమీక్ష
తెలంగాణా రాష్ట్రంలోకి త్వరలోనే రుతుపవనాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో మంత్రి తుమ్మల వానాకాలం పంటసాగు వివరాలు, ఎరువుల నిల్వలు, సరఫరాపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 19వ తేదీ వరకు 17,50,000 ఎకరాలలో వివిధ పంటలు సాగు అయ్యాయని, ఇందులో అత్యధికంగా ప్రత్తి 15,60,677 ఎకరాలలో తరువాత కంది పంట 76,000 ఎకరాలలో సాగు అయ్యిందని అధికారులు మంత్రికి వివరించారు. అయితే రానున్న పక్షము రోజులలో వరి నార్లు పోసుకోవడం, దుక్కులు పూర్తి అయినందువలన ఆరుతడి పంటలు విత్తుకోవడం ఊపందుకుంటాయని తెలియజేశారు. వానాకాలం 2024కు సంబంధించి మన రాష్ట్రానికి 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.40 లక్షల మెట్రిక్ టన్నుల DAP, 10.00 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.60 లక్షల మెట్రిక్ టన్నుల MOP మరియు 1.00 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, పూర్తిగా ePoS ద్వారానే అమ్మకాలు జరిగేటట్లు చూడాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేసినట్లైతే సదరు డీలర్లు మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించారు.

