ఎయిరిండియా ‘బ్లాక్ బాక్స్’ అంశంపై మంత్రి క్లారిటీ
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Air India Plane Crash) దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడం వెనుక గల కారణాలను అన్వేషించేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఈ విమానంలో అసలేం జరిగిందో తెలుసుకోనేందుకు అందరి దృష్టీ ఇప్పుడు ‘బ్లాక్ బాక్స్’ విశ్లేషణపై పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. విమానయాన మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పుణెలో జరిగిన హెలికాఫ్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపిస్తున్నారా? అని విలేకర్లు అడగ్గా.. ‘‘అవన్నీ కేవలం ఊహాగానాలే. బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది. దీన్ని ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోంది’’ అని స్పష్టం చేశారు. ఎప్పటివరకు దీంట్లోని డేటాను పొందొచ్చని మరో ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇది చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారం. ఏఏఐబీ దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియను పరిశీలించనివ్వండి’’ అన్నారు. బ్లాక్ బాక్స్ అనేది విమానంలో ఏం జరిగిందో అన్న సమాచారాన్ని రికార్డు చేసే ఓ చిన్న పరికరం. ఇది విమాన ప్రమాదాల దర్యాప్తులో దీన్ని డీకోడ్ చేయడం వల్ల విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే ఏం జరిగిందో తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుంది