NewsNews AlertTelangana

చౌటుప్పల్‌ ఎంపీపీ అరెస్టుకు కుట్ర

Share with

వనస్థలి పురంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వనస్థలిపురంలోని ఆయన నివాసానికి సోమవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌ కేసుల విషయంలో విచారించేందుకు తమతో రావాలని వెంకట్‌రెడ్డిని పోలీసులు ఒత్తిడి చేశారు.

చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి ఇంటికి అర్ధరాత్రి వచ్చిన పోలీసులు.. చిత్రంలో ఆయన భార్య

సమాచారం అందుకున్న బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు వెంకట్‌రెడ్డి ఇంటికొచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంకట్‌రెడ్డి భార్య, బంధువులు కూడా వాదించారు. దీంతో పోలీసులు వెంకట్‌రెడ్డికి నోటీసులిచ్చి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. తాను టీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని కేసులు ఇప్పుడే గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరేందుకు ఇటీవల 300 మంది టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలతో సమావేశమయ్యానని, ఆ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.