పిల్లలతో చెలగాటం…పాముకు ప్రాణ సంకటం
తెలంగాణలో ఒకే రోజు రెండు విచిత్ర సంఘనటనలు చోటు చేసుకున్నాయి.ఒక విద్యార్ధి కోతికి భయపడి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకితే…మరో చోట కొంత మంది విద్యార్ధులు ఏకంగా పాముని సీసాలో బంధించి సరదాగా ఆడుకున్నారు. సాధారణంగా పాముని చూసి చాలా మంది భయపడుతుంటారు.కానీ నిజామాబాద్‌లో సీన్ రివర్స్ అయ్యింది. విద్యార్ధులను చూసి పాము భయం భయంతో తప్పించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొందరు పాముతో విన్యాసాలు చేశారు.ఏడో తరగతి విద్యార్థులు పాఠశాల విశ్రాంతి సమయంలో ఆరుబయటకి వచ్చి ఆడుకుంటుండగా పాము కనిపించింది.ఏమాత్రం బెరుకు భయం లేకుండా విద్యార్థులంతా కలిసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పామును బంధించి దాంతో ఆడుకున్నారు.ఇలా బంధించే క్రమంలో పాము వారి చూసి చాలా సార్లు తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ విద్యార్ధులు పట్టువిడవకుండా దాన్నిప్లాస్టిక్ డబ్బా లో బంధించి ఆనందించారు.దీన్ని చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.గట్టిగా మందలించడంతో ప్లాస్టిక్ డబ్బాతో ఉన్న పాముని వదిలి అక్కడ నుంచి వెళ్లిపోయారు.