మెగా బీచ్ క్లీనింగ్ – వండర్ బుక్ రికార్డు
అందమైన విశాఖ సాగర తీరానికి కొత్త రికార్డు దక్కింది. తాజాగా సముద్రతీర ప్రాంత పరిశుభ్రతలో GVMC వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దొరికింది. శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకూ సుమారు 28 కిలోమీటర్ల ఈ మెగా క్లీనింగ్ కార్యక్రమం కొనసాగింది. సముద్రతీరప్రాంతంలోని వ్యర్థాలను తొలగించే ఈ కార్యక్రమంలో మొత్తం 22వేల 157మంది పౌరులు స్వచ్చందంగా పాల్గొన్నట్లు GVMC కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, విశాఖ మేయర్ గొలగని వెంకట హరికుమారి, కలెక్టర్, పోలీస్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ క్లీనింగ్ కార్యక్రమం తర్వాత బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సీయం జగన్ పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా ప్లాస్టిక్ ప్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో ఒక్కరోజే ఉదయం 6 నుండి 8 వరకూ 2 గంటల్లో సుమారు 76 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించారని సీయం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ నాణానికి రెండు వైపుల వంటివని సీయం అన్నారు. అమెరికా సంస్థ పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈసంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు ఉంది. ఇది ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రం నుండి బయటకు తీస్తుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు, పోలీస్ సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థలకూ, ప్రజలకూ GVMC కృతజ్ఞతలు తెలియజేసింది.