తుపాకీతో బెదిరించి నగల షోరూంలో భారీ చోరీ..
బిహార్‌లోని పట్నాలో ఒక నగల దుకాణంలో పట్టపగలే కొందరు దుండగులు చొరబడ్డారు. సిబ్బందిపై తుపాకీ గురిపెట్టి, బెదిరించి కోట్ల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. నేటి ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దుకాణం తెరిచిన కొద్ది సేపటికే 10 మంది దుండగులు మంకీక్యాప్‌లు, హెల్మెట్, మాస్కులు ధరించి తుపాకులతో లోపలికి ప్రవేశించారు. సెక్యూరిటీ వద్ద తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన నగలను, షోరూంలోని నగదును కూడా కొల్లగొట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో వారిని వెంబడించారు. వారిపై కాల్పులు జరిపారు. ఇద్దరికి గాయాలయ్యాయని, కానీ అందరూ పరారయ్యారని పేర్కొన్నారు. బంగారు నగల విలువ రూ.25 కోట్లు ఉంటుందని, కానీ నగదు ఎంతో లెక్క తేలాల్సి ఉందని షోరూం మేనేజర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.