జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు
ఏపీలోని పిఠాపురం నగరం జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమయ్యింది. జనసైనికులు జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సా.4 గంటలకు సభకు హాజరుకానున్నారు. సినీ నటుడిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ ఒంటరిగా పోరాటం చేసి జనసేన పార్టీని పోటీ చేసిన అన్నిచోట్లా గెలిపించారు. పార్టీని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా 21మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి, సభకు 1,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే జనసేన సభ కారణంగా పిఠాపురంలో నేటి ఉదయం 11 గంటల నుంచి రా.11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉంటాయి. కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

