జైలులో పెళ్లి.. కేసు పెట్టిన బాధితురాలే వధువు..
జైలులో చాలా కఠినంగా రూల్స్ ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా.. ఒక్క రోజు బయటకు పంపాలన్నా అనేక రూల్స్ అడొస్తాయి. అలాంటిది లైంగికదాడి కేసులో నిందితుడిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఏకంగా జైలులో పెళ్లి చేసుకున్నాడు. పైగా వధువు ఎవరో కాదు.. అతడిపై కేసు పెట్టిన బాధిత యువతే కావడం విశేషం. ఈ ఘటన ఒడిశాలోని పోలసర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. గోచాబాది గ్రామానికి చెందిన సూర్యకాంత్ బెహెరా అనే యువకుడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గత ఏడాది నవంబరులో పోలీసులు అతడిని అరెస్టు చేసి, గంజాం జిల్లాలోని కొడాలా సబ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే, ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు నిందితుడు, ఫిర్యాదు చేసిన యువతి కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే నిందితుడు సూర్యకాంత్, బాధిత యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడని కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వటంతో ఆదివారం జైలులోని హనుమాన్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం అధి కారులు వారి పెళ్లి జరిపించారు.

