రాజీనామా ఆమోదం కాకపోవడంపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం
వైసీపీ కి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన రాజీనామా వివాదంపై మండలిలో తీవ్ర ఆరోపణలు చేశారు . తాను స్వచ్ఛందంగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా రాజీనామా సమర్పించినప్పటికీ, శాసన మండలి ఛైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఆమోదాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా సమర్పించిన తన రాజీనామాను సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆమోదించకపోవడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని విమర్శించారు. 2011 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో అంకితభావంతో పనిచేసినా, పార్టీలో తనకు నిరంతరం రాజకీయ నిర్బంధం, అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు దక్కాల్సిన గౌరవం, బాధ్యతలు ఇవ్వకపోవడం, ముఖ్యంగా కీలక నియోజకవర్గ బాధ్యతల్లో ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. అంతేకాక, తాను కమ్మ కమ్యూనిటీకి చెందినవాడిననే కారణంగా పార్టీలో వివక్షకు గురయ్యానని సంచలన ఆరోపణ చేశారు. ఇతర వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ, తనకు సముచిత గుర్తింపు ఇవ్వకపోవడం పార్టీలో సామాజిక వివక్ష ఎక్కువ ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి వాతావరణంలో తాను పార్టీ సభ్యత్వాన్ని కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, త్వరలోనే తన భవిష్యత్ రాజకీయ దిశపై నిర్ణయం ప్రకటిస్తానని ఆయన సూచించారు.

