మమతాను కూడా ఇందిరలాగే.. విద్యార్థి అనుచిత పోస్టు
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా ఇందిరాగాంధీలాగే కాల్చి చంపాలంటూ పశ్చిమబెంగాల్ విద్యార్థి సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై ఆందోళనల నేపథ్యంలో ఒక విద్యార్థి ఇలా చేయడం సంచలనంగా మారింది. ఈ నిందితుడు బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కీర్తిశర్మగా పోలీసులు గుర్తించారు. దీనితో సీఎంపై హత్యాయత్నం, అల్లర్లకు రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడినందుకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇతని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో మమతాబెనర్జీపై కాల్పులు జరపాలని, ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా తానేమీ నిరుత్సాహపడబోనని పేర్కొన్నాడు. దీనితో తృణమూల్ కార్యకర్తల ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె పేరు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలలో షేర్ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దీనిపైన కూడా పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


 
							 
							