InternationalNews

మకర జ్యోతి దర్శనం.. అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిగిరులు!

Share with

మకర సంక్రాంతి పర్వదినాన శబరి గిరుల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. సోమవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయంలో పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనం ఇచ్చింది. మహా హారతి అనంతరం.. మకర జ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.

మకర జ్యోతిని అయ్యప్ప స్వామి దివ్య స్వరూపంగా విశ్వసించే అయ్యప్ప భక్తులు.. జ్యోతి ప్రత్యక్ష దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. దాదాపు 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనంతో పులకించారు. మకర జ్యోతి వీక్షణ కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం 50 చోట్ల వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది. గరిష్టంగా 70 వేల మంది భక్తులనే అనుమతిస్తామని దేవస్థానం, కేరళ ప్రభుత్వం చెప్పినప్పటికీ.. దానికి ఐదు రెట్లు ఎక్కువ సంఖ్యలో భక్తులు శబరిమల తరలి వెళ్లారు.

అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం తహతహలాడుతారు. నలభై ఒక్క రోజులపాటు మండల దీక్ష చేపట్టిన అనంతరం ఇరుముడితో శబరిమల చేరుకొని.. పంబా నదిలో స్నానం చేసి.. స్వామికి ఇరుముడి సమర్పించి.. మకర జ్యోతిని దర్శించుకుంటారు. మకర జ్యోతి దర్శనంతో తమ జీవితం ధన్యమైందని అయ్యప్ప భక్తులు భావిస్తారు.

గతంతో పోలిస్తే ఈసారి శబరిమలకు అయ్యప్ప భక్తుల రాక పెరిగింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పట్టింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు భక్తులైతే స్వామి వారిని దర్శించుకోకుండానే తిరుగుముఖం పట్టారు. స్వామి మాలధారణ చేసిన చిన్నారులకు వేగంగా దర్శనం పూర్తయ్యేలా దేవస్థానం అనుమతి ఇచ్చింది.