NationalNews Alert

ఒకే వేదికపై రజనీ,కమల్ -బాహుబలిని తలపించే మణిరత్నం మూవీ

దక్షిణాది సినిమా ప్రేక్షకులకు కనువిందు కలిగింది. తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్ చాలాకాలం తర్వాత కలిసి పాల్గొన్న మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 1’ ట్రైలర్ విడుదలయ్యింది. మంగళవారం అర్థరాత్రి వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో రజనీ కాంత్, కమల్ ఒకే వేదికపై అభిమానులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల కేరింతల మధ్య జరిగింది. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.

 బడ్జెట్‌తో , అత్యంత ప్రతిష్టాత్మకంగా మణిరత్నం దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది. ఈ కార్యక్రమంలో రజనీ, కమల్‌తో పాటు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తీ, త్రిష కూడా సందడి చేశారు. ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మళయాల భాషల్లో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ప్రముఖ రచయిత కల్కి నవల ఆధారంగా రూపొందిన  ఈ పిరియాడిక్ చిత్రం ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 3 నిముషాల నిడివి గల ఈ తమిళ ట్రైలర్‌లో చిత్రం గురించి కమల్‌హాసన్ చెప్పే కథనంతో మొదలవుతుంది. ట్రైలర్ చూసినవారు ఈ సినిమాను బాహుబలి చిత్రంతో పోలుస్తున్నారు. కొన్నాళ్లుగా సరైన విజయాలు లేని మణిరత్నం ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని  అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మూవీలో పూర్వం భారత్‌ను పరిపాలించిన చోళరాజుల కథను వివరించేలా తీర్చిదిద్దబడింది. ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ నెల 30 వరకూ వేచి చూడాల్సిందే.