Andhra PradeshNews Alert

9న అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. నిన్న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. ఏపీలో కొన్ని చొట్ల తేలిక పాటి జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ నెల 7న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల తరువాత అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

ఈ నెల 8వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. అదే సమయంలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్దొద్దని సూచించింది. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి అగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్‌ ప్రాంతం, మధ్య మహరాష్ట్ర, కర్ణాటక అంతర్భాగంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది.