లారీ బీభత్సం.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్ లో లారీ బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ చౌరస్తాలో ఈ వేకువజామున 2.30 గంటల సమయంలో స్థానిక ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ముషీరాబాద్ చౌరస్తా వద్దకు రాగానే లారీ వాహనం అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత పోలీస్ పెట్రోలింగ్ వాహనంపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు. క్షత గాత్రులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ యూసఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.