శ్రీశైల పుణ్యక్షేత్రంలో మద్యం బాటిల్స్ కలకలం
శ్రీశైలం: నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మద్యం బాటిల్స్ కలకలం రేపాయి. సాక్షాత్తూ మల్లికార్జునుడు కొలువైన పవిత్ర క్షేత్రంలో సారా ఇతర మత్తు పదార్థాలను సేవించడం నిషేధించారు. దేవదాయ ధర్మదాయ చట్ట ప్రకారం ఆలయ పరిసరాల్లో వాటిని నిషేధిస్తూ అమలు చేస్తున్నారు కూడా. అయినా సరే సారాయి ఇతర మత్తు పదార్థాలు శ్రీశైలంలో భారీగా పట్టుబడుతున్నాయి. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలతో శ్రీశైలం టోల్ గేట్ వద్ద పట్టుబడిన మద్యాన్ని శ్రీశైలం పోలీసులు మల్లమ్మ కన్నీరు డంప్ యార్డ్ లో ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, పంచాయితీ శాఖ అధికారుల సమక్షంలో శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 43 కేసులలో పట్టుబడిన మొత్తం 1,197 బాటిళ్ల మద్యం, 186 లీటర్ల నాటు సారాయిను శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద డంపింగ్ యార్డ్ లో ట్రాక్టర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. క్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని పూర్తిస్థాయిలో పాటిస్తున్నామని మద్యం సరఫరా అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే శ్రీశైల క్షేత్ర పరిధిలోకి మద్యం సేవించడమే కాకుండా మద్యం కలిగి ఉండడం కూడా నేరమని ఆయన తెలిపారు. ఈ నిబంధనను ప్రతి ఒక్క భక్తుడు పర్యాటకుడు కచ్చితంగా పాటించాలని, నిషేధిత పదార్థాలను మత్తు పానీయాలను దేవస్థానంలోకి అనుమతించమని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.