ఫ్రీ బస్సెలా ఉందో చూద్దామని స్కూల్‌కి డుమ్మా
ప్రాక్టికల్ గా ఆలోచించాలి…ప్రయోగాత్మక విద్యను అలవర్చుకోవాలని ఇంటి దగ్గర చదువుకున్న తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు తరచూ చెబుతూ ఉంటారు.దాన్ని సార్ధకం చేసుకోవడానికి ,తక్షణమే అమలు చేయడానికి ప్రయత్నించారు కొంత మంది బాలికలు.సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం పై విస్తృత ప్రచారం జరుగుతుండటంతో అసలు దాని యవ్వారం ఏందా ..అనుకున్నారో ఏమో అనుకున్నదే తడవుగా కొంత మంది బాలికలు ఫ్రీ బస్సులో చెక్కర్లు కొట్టారు.పాఠశాలకు డుమ్మ కొట్టీ మరీ ఈ ప్రయోగాత్మక విద్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బాలికల ఉన్నత పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల భాగోతం ఇది.తల్లిదండ్రులలు,పాఠశాల ఉపాధ్యాయులు,పోలీసులు అల్లలాడుతుంటే పిల్లలు మాత్రం ఎంచక్కా బస్సులో ఊరంతా తిరిగి రెండు రోజులకు కనిపించారు.బాలికలు తీసుకెళ్లిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి వీరిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు.తీరా వారిని వివరాలడిగితే… ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకుందామని ఇలా ఫ్రీ బస్సు పై అధ్యయనం చేయడానికే స్కూల్‌కి డుమ్మా కొట్టామని చెప్పడంతో అంతా ఖంగుతిన్నారు.