NewsNews AlertTelangana

అవినీతి కేసీఆర్‌ను గద్దె దించుదాం

తెలంగాణాలో అవినీతి తాండవిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. రూ.40 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును రూ.1.4 లక్షల కోట్లకు పెంచిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. దీన్ని ఏటీఎంగా వాడుకుంటోందని ఆరోపించారు. వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీలో శనివారం నిర్వహించిన బండి సంజయ్‌ మహా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో నడ్డా ముఖ్య అతిథిగా ప్రసంగించారు. `ఓరుగల్లు గడ్డపై వరంగల్‌ ప్రజలకు నా నమస్కారములు` అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన నడ్డా.. వరంగల్‌ కుల దైవమైన భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా అభివర్ణించారు. వందలాది కిలోమీటర్ల పాదయాత్రతో తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకొని, వారికి ధైర్యం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత యాత్ర ముగింపు సమావేశానికి హాజరవడం పట్ల హర్షం వెలిబుచ్చారు. కేసీఆర్‌ సర్కారు దురాగతాలతో చీకట్లోకి నెట్టబడిన తెలంగాణ ప్రజల్లో వెలుగు నింపేందుకే బండి సంజయ్‌ ఈ యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ సభకు కేసీఆర్‌ సర్కారు అనుమతి నిరాకరించిందని తెలిసిందని, హైకోర్టు ద్వారా అర్ధరాత్రి అనుమతి సాధించి సభ పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇక్కడ స్వాగతం పలికేందుకు ప్రజలు రాకుండా 144వ సెక్షన్‌ విధించడం దారుణమన్నారు. గతంలోనూ బండి సంజయ్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయనను విడిపించేందుకు తాను ఇక్కడికొస్తే కరోనా సాకుతో ఎయిర్‌ పోర్టులోనే అడ్డుకున్న విషయాన్ని నడ్డా గుర్తు చేసుకున్నారు.

నయా నిజాంకు ఇదే చివరి ఆదేశాలు

గతంలోనూ `కస్తే నిషాన్‌ 53` పేరుతో తెలంగాణాలో సభలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు విధించిన నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు అదే చివరి ఆదేశాలయ్యాయని గుర్తు నడ్డా చేశారు. ఇప్పుడు ఇక్కడ విధించిన 144వ సెక్షన్‌ కూడా నయా నిజాం కేసీఆర్‌కు చివరి ఆదేశాలు అవుతాయని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కూడా ఇంట్లో కూర్చోబెడతారని, రాష్ట్రంలో బీజేపీ గద్దెనెక్కుతుందని ఢంకా బజాయించి చెబుతున్నానన్నారు. ఇక ఆదేశాలిచ్చే అవకాశమే కేసీఆర్‌కు లభించదన్నారు. గతంలో ఇక్కడి కాకతీయ మెడికల్‌ కాలేజీ దుస్థితిని చూసి.. ప్రధాని మోడీకి నచ్చజెప్పి రూ.120 కోట్లు విడుదల చేయించానని నడ్డా గుర్తు చేశారు.

కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న కేసీఆర్‌

ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన పలు పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా టీఆర్‌ఎస్‌ సర్కారు అడ్డుకుంటోందని.. మహిళలు, దళితులు, పీడితులను అభివృద్ధి చేసే ఈ పథకాలు నేరుగా మీకు దక్కాలంటే రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు రావాల్సిందేనని నడ్డా కుండబద్దలు కొట్టారు. ఇటీవల 11 జిల్లాల్లో వరదలొస్తే కేంద్రం విడుదల చేసిన రూ.188 కోట్లలో ఒక్క పైసాను కేసీఆర్‌ ప్రభుత్వం ఖర్చు చేయలేదని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో వివిధ పథకాల కోసం కేంద్రం రూ.3900 కోట్లు ఇస్తే.. తెలంగాణ సర్కారు మాత్రం రూ.200 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను ఇక్కడి ప్రజలకు చేరకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని, వాటి పేరు మార్చి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందన్నారు.

బీజేపీ.. తెలంగాణాను సమర్ధించిన తొలి పార్టీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్ధించిన తొలి పార్టీ బీజేపీ అని నడ్డా చెప్పారు. కాకినాడ తీర్మానంలో తెలంగాణ అంశాన్ని చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్‌ పార్టీకి భయపడి ఆ మాటే మర్చిపోయారని నడ్డా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

దుబ్బాక ధమాక రాష్ట్రంలోనూ కొనసాగాలి

దుబ్బాకలో తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించి ధమాకా సృష్టించారని, హుజూరాబాద్‌లోనూ హుజూర్‌ను పడగొట్టి ఈటలను గెలిపించారని నడ్డా గుర్తు చేశారు. ఈ ధమాకా రానున్న రోజుల్లో తెలంగాణా అంతా విస్తరించాలని, కేసీఆర్‌ను ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని.. ఈ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను అంతం చేసేందుకు తెలంగాణ ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.