‘భారత్‌ను అగ్ర స్థానంలో నిలుపుదాం’..కేజ్రీవాల్
‘భారత్‌ను అగ్ర స్థానంలో నిలుపుదాం’ అని ‘ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారత పౌరులకి పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని మరింత బలంగా మార్చుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యావత్ దేశం మద్దతు పొందేందుకు, లోక్‌సభ ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా చేసుకొని ప్రజలలోకి దూసుకువెళ్లనుంది. బుధవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంను వేదికగా చేసుకోని కేజ్రీవాల్ మాట్లాడుతూ గత ”దశాబ్దాల పాటు భారతదేశాన్ని’అభివృద్ధి చెందిన దేశం’ గా కాకుండా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా నిలిపిన పార్టీలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి గెలుస్తాం. అధికార పగ్గాలు వారికి వదిలిపెట్టబోమని.. భారత్‌ను అగ్రస్థానంలో నిలబెడతామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మీరందరూ మాతో ఉండాలని ఆయన పౌరులకు పిలుపునిచ్చారు.

భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచాలన్న కలను నేరవేర్చుకోవాలంటే బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ కలిసి ముందుకి రావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉంచాలంటే ముందుగా ఈ ఐదు సూత్రాలను ఆచరణలో పెట్టాలన్నారు.
● దేశంలోని ప్రతి చిన్న బిడ్డకు ఉన్నతమైన,నాణ్యతమైన విద్యను అందించాలి.
● దేశ పౌరులకు ఉచిత వైద్యాన్ని, అందుకు తగిన పరికరాలను, ఉచిత మందులను అందజేయాలి.
● దేశంలోని యువతకు ఉద్యోగవకాశాలు కల్పించాలి.
● ప్రతి మహిళకి సరైన భద్రత కల్పించాలి.
● రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ పిల్లలు కూడా వ్యవసాయ కుటుంబం అని గర్వపడాలి. లాభనష్టాల పంట పండాలంటే రైతుగా కొనసాగాలనే కోరికను పెంపొందించుకోవాలని కేజ్రీవాల్ తెలియజేశారు.

