InternationalNews

‘చంగ్ చియాన్‌’లా ‘మూసీ’ని మార్చితీరుతాం..

తెలంగాణ మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో పర్యటిస్తోంది. అక్కడి చంగ్ చియాన్ నది తీరుతెన్నులను అధ్యయనం చేస్తోంది. సియోల్ నగరానికి, హైదరాబాద్ నగరానికి అనేక పోలికలు ఉన్నాయని వారు చెప్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సియోల్‌లో పర్యటించారు. ఇప్పుడు మంత్రుల బృందాన్ని కూడా అధ్యయనానికి పంపారు. ఒకప్పుడు మూసీ నదిలాగే మురికి నీరు పారుతూ ఉండే చంగ్ చియాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం ఎంతో కష్టపడి సుందరీకరణ చేసింది. వేల కోట్ల ఖర్చుతో ఆక్రమణ దారులను తరలించి, శుద్ధి చర్యలు చేపట్టింది. దీనితో ఇప్పుడు సియోల్ నగరానికే ఈ నది చక్కటి టూరిస్ట్ ప్లేస్‌గా అవతరించింది. నదికి ఇరుపక్కలా మెట్లు, వంతెనలు, కాలిబాటలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అక్కడ భూమి రేట్లు కూడా 30 నుండి 40 శాతం పెరిగాయని చెప్తున్నారు. అలాగే మూసీ నదిని కూడా పరిశుభ్రంగా, సుందరంగా మారుస్తామని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయని పేర్కొన్నారు.