home page sliderHome Page SliderTelangana

భూ వివాదం.. కత్తులు, రాళ్లతో దాడి

ఓ భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ సర్వే నంబర్ 951, 952లోని సుమారు 7.5 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కంగుల రాములు, పోచయ్యతో పాటు మరికొందరి నుంచి కంగుల గండయ్య, ఈదయ్య జీపీఏ చేసుకున్నారు. అనంతరం 1970లో సదరు స్థలంలో 170 ప్లాట్లు చేసి విక్రయించారు. అయితే ఈ జీపీఏ చెల్లదంటూ కంగుల కుటుంబానికి చెందిన వారసులు, ఇదే భూమిని 2013లో బ్రాహ్మణపల్లికి చెందిన సంరెడ్డి బాల్ రెడ్డికి విక్రయించారు. ఆయన కొంత విస్తీర్ణంలో ఫాంహౌస్‌తో పాటు చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ప్లాట్ల యజమానులు, బాల్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది.

దీనిపై ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించగా 28 మార్చి 2025న జిల్లా న్యాయస్థానం వీరికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో లే అవుట్ రోడ్లను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించారనే కారణంతో రెండు నెలల క్రితం హైడ్రా అధికారులు ఫాంహౌస్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చేశారు. దీనిని సవాలు చేస్తూ బాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో హైడ్రా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఇందులో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా కొంతమంది ప్లాట్ల ఓనర్లు తమ స్థలాలను చదును చేసుకునేందుకు జేసీబీ తీసుకుని వెళ్లారు.. దీనిని గమనించిన బాల్ రెడ్డి, అతడి అనుచరులు ప్లాట్ల యజమానులతో వాగ్వాదానికి దిగారు. బాల్ రెడ్డి వర్గం వారు రాళ్లు, కర్రలు, కత్తితో దాడి చేయడంతో సత్యనారాయణరెడ్డి, నవీన్, వెంకటేశ్‌కు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.