నగరంలో అంగరంగ వైభవంగా బోనాలు
హైదరాబాద్‌లో ప్రసిద్ధికెక్కిన లాల్ దర్వజా బోనాలు పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సంప్రదాయ పండుగైన ఈ బోనాలు పండుగ వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. లాల్ దర్వాజాలోని సింహావాహిని మహంకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బలిగంప కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో తెలంగాణ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడైన వీరేందర్ గౌడ్ కుటుంబసభ్యులతో సహా మహాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర మంత్రులు తలసాని యాదవ్, మహమూద్ అలీ రాష్ట్రప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు పదివేలమంది భక్తులు బోనాలు సమర్పించారని, లక్షమంది అమ్మవారి దర్శనం చేసుకున్నారని ఈ ఆలయ కమిటీ ఛైర్మన్ తెలిపారు. ఆదివారం బోనాలు చివరి వారం పండుగ ముగియడంతో ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం నేడు సోమవారం సెలవు ప్రకటించింది.

