కలెక్టర్‌తో నిర్మల ప్రవర్తించిన తీరు నన్ను భయపెట్టింది:కేటీఆర్
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్‌తో కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు తనను భయపెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ నాయకుల ప్రవర్తలతో ఐఏఎస్ అధికారులు భయపడుతున్నారని పేర్కొన్నారు. కష్టపడి పని చేసే ఐఏఎస్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహరంలో కలెక్టర్ గౌరవప్రదమైన ప్రవర్తనకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.
అసలేం జరిగిందంటే…

పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లా బీర్కూట్‌లో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ని ఆదేశించారు. రేషన్ బియ్యానికి కిలోకు 35 రూపాయలు ఖర్చవుతుందని, అందులో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో రేషన్ దుకాణాలపై ఎందుకు పెట్టడం లేదంటూ కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ ని ప్రశ్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇదే విషయంలో కేంద్రమంత్రి తీరును తప్పుపడుతూ మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.

