NewsTelangana

కిషన్‌ రెడ్డి.. ఎక్కడికైనా వస్తా.. తేల్చుకుందామా..?

‘కిషన్‌ రెడ్డి.. ఎక్కడికైనా వస్తా.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన జీఎస్టీ నిధులు ఎంత.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్నో తేల్చుకుందామా..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి అయిన కిషన్‌ రెడ్డి సోయి ఉండే మాట్లాడుతున్నారా..? అని ఎద్దేవా చేశారు. కేంద్రానికి జీఎస్టీ రూపంలో తెలంగాణ రాష్ట్రం రూ.30 వేల కోట్లు ఇచ్చిందని.. రాష్ట్రానికి కేంద్రం రూ.8 వేల కోట్లే ఇచ్చిందని హరీశ్‌ రావు వివరించారు. 42 శాతం నిధులు ఇచ్చామని కేంద్రం చెబుతోందని.. ఇచ్చింది మాత్రం 29 శాతమేనని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు కిషన్‌ రెడ్డితో చర్చల కోసం ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్‌ చేశారు.

ఐటీ, ఈడీ, సీబీఐ.. బీజేపీ విడిచిన బాణాలే..

ఈడీ, ఐటీ, సీబీఐ.. బీజేపీ విడిచిన బాణాలేనని.. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో అవి ముందుగానే వస్తాయని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల రూపాయల అప్పు తెస్తోందని.. గత ఆరు నెలల్లోనే ఏకంగా రూ.1 కోటి కోట్ల అప్పులు తెచ్చిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాత్రం తలా.. తోకా.. లేని మాటలు మాట్లాడతాడని.. కాంగ్రెస్‌ నేతలు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.