Home Page SliderTelangana

కిషన్ రెడ్డిని 20 పోలీసు వాహనాలతో.. నగరమంతా తిప్పుతున్న పోలీసులు

బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో హైదరాబాద్ పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను 20 పోలీసు వాహనాలతో.. నగరమంతా తిప్పుతున్నట్లు సమాచారం.  75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా,అక్రమంగా అరెస్టు చేయడం ఇదే తొలిసారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఈ విషయంపై  పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అని హెచ్చరించారు. ఆయన పోలీసులతో మాట్లాడుతూ..”శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకన్నా నేను ఎక్కువ బాధ్యతగా ఉంటాను. కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లో పోలీసులు వ్యవహరించాలి. కేంద్రమంత్రి కాన్వాయ్ కు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో దౌర్జన్య పాలన నడుస్తోంది”అని అసహనం వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ వద్ద కిషన్ రెడ్ది గారి వాహనాన్ని పోలీసులు దారి మళ్లించినట్లు తెలిస్తోంది. ఈ వాహనంలో డ్రైవర్ ను దించేసి.. కిషన్ రెడ్డి వాహనాన్ని నడుపుతున్నారు డీసీపీ స్థాయి అధికారి. దీనితో కిషన్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పట్లేదని బీజేపీ శ్రేణులు ఆందోళనలు జరుపుతున్నాయి.