ఎంత తేడా.. ఇద్దరూ ఇద్దరే.. ఒకరు మాజీ సీఎం, మరొకరు మాజీ మంత్రి
ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతల్లో పనిచేశారు. తమకు మించినవారు మరొకరులేరన్నట్టుగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపూ పొందారు. ఒకరు సీఎంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని విభేదించి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి, మళ్లీ ఇటీవల బీజేపీలో చేరారు. మరొకరు రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించి సొంత ఊరు నీలకంఠాపురంలో ఆలయం పనుల్లో నిమగ్నమై తాజాగా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరూ ఎవరో కాదు ఒకరు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరొకరు ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ మంత్రి ఎన్ రఘువీరారా రెడ్డి.

ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించారు. ఆ పార్టీ కోసం ఎంతగానో పనిచేశారు. కానీ కట్ చేస్తే ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రెండు రకాల ట్యూన్స్‌లో అడుగులు వేస్తున్నారు. రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదల్లేక ఒకరు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదని మరొకరు నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తూ.. ప్రజల్లోకి వెళ్లి తమ తమ వాదనలను విన్పించాలని భావిస్తున్నారు. అందుకు తగిన గ్రౌండ్ సైతం ప్రిపేర్ చేసుకుంటున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇటీవల బీజేపీలో చేరి, తాను కమలం పార్టీ కోసం ఎక్కడ పనిచేయమన్నా చేస్తానన్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టానని, చిత్తూరు జిల్లా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యానని, కర్నాటకలో సొంత నివాసం ఉందని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. పార్టీ ఆదేశిస్తే, దేశంలో ఎక్కడైనా పనిచేస్తానన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీలో చేరి.. ఆ పార్టీ కోసం దేశంలో ఎక్కడైనా పనిచేస్తానంటుంటే.. మరొక నేత రఘువీరా రెడ్డి మాత్రం అదే రక్తం, అదే పౌరుషం అంటూ తాను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తానంటూ కర్నాటక కురుక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో అడుగు పెట్టినప్పుడు ఎదురెళ్లి స్వాగతం పలికిన రఘువీరా కొద్ది రోజులుగా మౌనం దాల్చారు. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం సైతం జోరుగా సాగింది. అదే సమయంలో ఆయన కుమార్తెను సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది. కొన్నాళ్లు రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని రఘువీరా ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలో చావో, రేవో అన్నట్టుగా ఉన్న ఈ తరుణంలో రఘువీరా, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారు. తాను పార్టీ కోసం పనిచేస్తానంటూ ముందుకు కదలుతున్నారు.

మొత్తంగా ఇక్కడ చొప్పొచ్చేదేంటంటే ఇద్దరు నేతలు ఎంచుకున్న రాజకీయమార్గం గురించి మాత్రమే. ఒకరు బీజేపీలో చేరి, ఆ పార్టీని ఉద్దరిస్తానంటుంటే.. మరొకరు ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పుడు తాను, హస్తం పార్టీకి కర్నాటకలో ప్రచారం చేసి పార్టీని గెలిపిస్తానంటున్నారు. మొత్తంగా ఇద్దరు రాజకీయనాయకులు ఇక మైకులు ముందు లెక్చర్లు ఓ రేంజ్‌లో దంచడం ఖాయమనుకోవాలి.

