పర్యావరణ హితమైన ఆకలి తీర్చే ఖీర్ గణపతి
భగవంతుడు కోరుకొనేది మానవుల శ్రేయస్సునే. “మానవసేవయే మాధవసేవ”అనే సూత్రాన్ని నమ్మింది. ముంబైకి చెందిన రింతూ కళ్యాణి.
ఆమె పుణ్యం పురుషార్థం కలిసి వచ్చేలా చక్కటి ఆలోచనను చేసింది. అదేంటంటే ప్రతి సంవత్సరం వినాయకచవితి నాడు వినాయక ప్రతిమలను నిమర్జనం చేస్తూ ఉంటాం. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు తర్వాత నిమర్జనం చేసే బదులు ప్రజలకు పనికివచ్చే విధంగా ఏం చేయాలనే ఆలోచనతో చాక్లెట్ వినాయకుని తయారీని మొదలుపెట్టింది.

ఆమెకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఆమెకు ముంబైలోని జుహు బీచ్‌లో మార్నింగ్ వాక్ చాలా ఇష్టం. గణేశ నిమర్జనాల తర్వాత బీచ్‌లో చెల్లాచెదరుగా ఉండే విగ్రహాలను చూసి చాలా బాధ పడేది. అప్పుడే పర్యావరణ హితమైన వినాయకుని ప్రతిమను తయారుచేయాలన్న సంకల్పం చేసుకుంది. రింతూ వృత్తిరీత్యా బేకర్. కానీ పిల్లల పెంపకం బాధ్యత వల్ల వృత్తికి దూరమయ్యింది. ఎవరూ ఆకలితో ఉండకూడదనేది ఆమె సిద్ధాంతం. తోటి గృహిణులతో కలిసి ఫుడ్‌ఆర్మీ అనే NGOను ప్రారంభించి, పేదలకు, అవసరంలో ఉన్నవారికి ఆహార పంపిణీ చేసేది. వారి అపార్ట్‌మెంట్‌లో కప్ కేకులతో గణేశ బొమ్మలు తయారుచేసి పిల్లలకు పంచిపెట్టేది.

మన దేవాలయాలలో క్షీరాన్న ప్రసాదం స్ఫూర్తితో ఆమె కొత్తగా ఖీర్ (పాయసం) గణపతిని తయారుచేయాలనే ఐడియా చేసింది. పాలపొడి, బియ్యపురవ్వ, డ్రైఫ్రూట్స్ , పంచదార, ఇలాచీ వంటి వాటితో చాలా ప్రయోగాలు చేసి తొమ్మిది నెలలకు ఖీర్ వినాయకుని ప్రతిమను విజయవంతంగా తయారుచేసింది. పూజ తర్వాత నిమర్జనం రోజున దానిని పాలలో ముంచితే, పాయసం సిద్దమవుతుంది. దానిని అనాథ పిల్లలకు పంచిపెడుతూ ఉంటుంది. ఇంతవరకూ దాదాపు వెయ్యిమందికి ఆమె చాక్లెట్ వినాయకుని తయారీని నేర్పించింది. ఇప్పుడు ఈ ఖీర్ గణపతి తయారీని నేర్పించాలనకుంటోంది రింతూ కళ్యాణి.
ఈ రకంగా చాక్లెట్, ఖీర్ వినాయక ప్రతిమల ద్వారా పేదల ఆకలిని తీరుస్తూ, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె అభినందనీయురాలు కదా..