KGF రాఖీభాయ్ స్ఫూర్తితో నలుగురిని చంపాడు
సినిమాల వల్ల యువతరం ఎంతగా భ్రష్టు పట్టిపోతోందో ఈ సంఘటన తెలియజేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న మూడు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ హత్యలపై పోలీసుల విచారణ కొనసాగుతుండగానే భోపాల్‌లో మరో హత్య జరిగింది. ఈ నాలుగు హత్యలు ఒకే తరహాలో జరిగాయి. ఈ నాలుగు ఘటనల్లో మృతులు సెక్యూరిటీ గార్డులే. మృతులు నలుగురూ నిద్రిస్తున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. దీంతో ఈ హత్యల వెనక ఒక్కడే ఉన్నాడా.. అన్న అనుమానాలు కలిగాయి. పోలీసుల దర్యాప్తులో చివరకు అదే తేలింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే… ఈ హత్యలు చేసిన యువకుడు కేజీఎఫ్ సినిమా ప్రేరణతోనే హంతకుడిగా మారినట్లు చెప్పాడు.

నిందితుడిని సాగర్ జిల్లా కేస్లీ గ్రామానికి చెందిన శివప్రసాద్ (19)గా పోలీసులు గుర్తించారు. భోపాల్‌లో సెప్టెంబర్ 1న రాత్రి ఓ మార్బుల్ షాపు సెక్యూరిటీ గార్డు హత్యకు గురవగా.. ఆ హత్య కేసును ఛేదించే క్రమంలో శివప్రసాద్ పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో సాగర్ జిల్లాలో జరిగిన ముగ్గురు సెక్యూరిటీ గార్డుల హత్యలు, భోపాల్‌లో జరిగిన సెక్యూరిటీ గార్డు హత్య శివప్రసాదే చేసినట్లు వెల్లడైంది. కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్‌లా ఫేమస్ కావడానికే తాను ఈ హత్యలు చేసి గ్యాంగ్‌స్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు వెల్లడించడం పోలీసులను షాక్‌కి గురిచేసింది.