Andhra PradeshNews Alert

KGF కాదు AGF – త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కనకవర్షం

బంగారం అంటే ప్రజలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోలార్ బంగారుగనులు ఇతివృత్తంగా  ఈ మధ్యకాలంలో వచ్చిన KGF1, KGF2  అనే సినిమాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాయి.. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బంగారు గనులను గుర్తించారు. అనంతపురం గోల్డ్ మైన్స్‌కి పెద్ద చరిత్రే ఉంది. టిప్పుసుల్తాన్ కాలంలోనే అనంతపురం వద్ద రామగిరి ప్రాంతంలో బంగారు గనులున్నట్లు గుర్తించారు. రామగిరి ప్రాంతంలో మట్టిని నమ్ముకుంటే బంగారం దొరుకుతుందని అక్కడివారు చెపుతూంటారు.

1921లో బ్రిటిష్‌వారు మైనింగ్ చేయడానికి ప్రణాళికలు వేసారు. కానీ తొలిసారి 1973లో దొడ్డబురుజు పేరుతో ఇక్కడ మైనింగ్ చేసి మట్టిలోంచి 20 గ్రాముల బంగారాన్ని వెలికితీసారు. తర్వాత 1984లో కర్నాటకలోని కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక గోల్డ్ ఫీల్డ్ కంపెనీ ఇక్కడ మైనింగ్ ప్రారంభించి సంవత్సరానికి 120 కిలోల చొప్పున 17 ఏళ్లపాటు బంగారం వెలికితీసారు. ఈ రామగిరి ప్రాంతంలో 20చోట్ల బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించినా కేవలం 4చోట్ల మాత్రమే తవ్వకాలు జరిగాయి. 2001లో తవ్వకాలు నిలిపివేసారు. కానీ ఇంకా 16 టన్నుల దాకా నిక్షేపాలున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. రామగిరి మైన్స్‌కు సమీపంలో 2చోట్ల, బొక్సంపల్లిలో 2 టన్నులు, జౌకులలో మొత్తం 10 టన్నులు ఉంటాయని అంచనా. కేవలం 50 మీటర్ల నుండి కిందకి వెళ్లేకొలదీ వందల ఏళ్లపాటు తవ్వినా తరిగిపోని నిల్వలు ఉన్నట్లు చెప్తున్నారు భారత్ గోల్డ్ మైన్ కంపెనీ వారు. అందువల్ల మైనింగ్ రంగాన్నిఅభివృద్ధి చేసే ఉద్దేశంతో దేశ జాతీయాదాయాన్ని కూడా పెంచే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 13 గోల్డ్ మైన్స్‌ను విక్రయించనున్నారు. ఈ 13లో 10 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే కావడం విశేషం.

ఏపీలో విక్రయించనున్న గోల్డ్‌ మైన్స్‌లో రామగిరి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి సౌత్‌ బ్లాక్‌, జవకుల-ఎ, జవకుల-బి, జవకుల-సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్‌ బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు. దీనితో ఇక్కడ ఇక పసిడి వర్షం కురిసే ఆవకాశం ఉంది. స్థానికంగా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.