iBomma కేసులో సజ్జనార్ బయటపెట్టిన కీలక నిజాలు!
హైదరాబాద్: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తరువాత, అతని కార్యకలాపాలపై మరిన్ని సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.
ఇమ్మడి రవి సినిమాల పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ లో కూడా కీలక పాత్ర పోషించినట్లు విచారణలో బయటపడిందని సజ్జనార్ తెలిపారు. “రవిని పోలీస్ కస్టడీకి కోరాం. కస్టడీ విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావచ్చు,” అని ఆయన అన్నారు.
పైరసీలో పాల్గొనడం, పైరసీ కంటెంట్‌ను చూడటం రెండూ కూడా నేరమే అని హెచ్చరించిన సజ్జనార్, యూజర్లకు ఒక కీలక సూచన చేశారు. “ఈ తరహా సైట్లు యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకుని ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయకూడదు,” అని స్పష్టం చేశారు.
సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో పైరసీ వెబ్‌సైట్లపై చర్యలు మరింత కఠినతరమవుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

