విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ కొనసాగింది. జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్, మాజీ ఐపీఎస్ అధికారి అయిన వీవీ లక్ష్మీనారయణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన కోసం సొసైటీ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ స్కాలర్ షిప్ హోల్డర్స్ అధ్యక్షుడు ఇంకా మరికొందరు వ్యాజ్యం వేశారు. ఈ కేసులో వాదనలు వినిపిస్తూ లక్ష్మీనారాయణ తరపున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా క్యాపిటివ్ మైన్స్ లేవని, అందుకని న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని, బాల్కో కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉందని అంటున్నారని కానీ దీనిపై సరైన స్పష్టత లేదని పేర్కొన్నారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కరోనా కారణంగా చైనాలో స్టీల్ ఉత్పత్తి తగ్గిందని, దానివల్ల దేశీయ స్టీల్ పరిశ్రమకు లాభాలు వచ్చాయని గుర్తు చేసింది. విశాఖ స్టీల్ లాభాలపై ఆరా తీయాలని సూచించారు. దీనికి అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ స్పందించి, గడచిన 4 నెలల్లో స్టీల్‌ప్లాంట్‌కు 200 కోట్ల రూపాయలు లాభం వచ్చినట్లు తెలిపారు. లాభాల్లో ఉండే సంస్థను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమెచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ వాదనల అనంతరం విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.

