ఈటల చేసిన తప్పేంటి సారూ…
ఈటలపై సర్కారు కక్షసాధింపు
అసెంబ్లీలో కన్పించకూడదన్న కసి
హుజూరాబాద్‌లో గెలవడంతో ఆగమాగం
మరమనిషి అన్నారన్న కారణంతో సస్పెన్షన్
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సర్కారు అదే అప్రజాస్వామిక పోకడలను అనుసరిస్తోందన్న విమర్శ మూటగట్టుకుంటోంది. బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ సర్కారు అదే దమననీతి కొనసాగిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అసెంబ్లీలో మాట్లాడేందుకు వచ్చిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను సర్కారు నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేసింది. స్పీకర్‌ను మరమనిషి అన్నారన్న కారణంగా ఆయనపై వేటు వేసినట్టు చెప్పారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి. మరమనిషి అన్నది చాలా ఘోరమైన పదం అంటూ వివరణ ఇచ్చారు మంత్రి. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ అందుకు ఈటల రాజేందర్ నిరాకరించారని… అందుకే అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనపై వేటు వేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు.

ఈటలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం
సస్పెన్షన్‌కు ముందు టీఆర్ఎస్ సభ్యులు, ఈటల రాజేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. క్షమాపణలు చెప్పాకే చర్చలో పాల్గొనాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ సభ్యుల నినాదాలపై ఈటల మండిపడ్డారు. సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం ఉందో.. లేదో చెప్పాలన్నారు. బెదిరిస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల క్షమాపణలు చెప్పకపోవడంతో ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈటలను కేసీఆర్ చూడొద్దనే సస్పెన్షన్ వేటు?
ఈటల రాజేందర్‍ను అసెంబ్లీలో చూడకూడదనుకున్న సీఎం కేసీఆర్ అదే పంథా అనుసరిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజలు ఆశీర్వదించి… అఖండ మెజార్టీతో గెలిపించడాన్ని సీఎం కేసీఆర్ భరించలేకపోతున్నారని స్పష్టమవుతోంది. అసెంబ్లీలో ఈటలను సీఎం కేసీఆర్ చూడకూడదనుకున్నా… ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి పంపించడంతో టీఆర్ఎస్ ఆగమాగమవుతోంది. స్పీకర్‌ను మరమనిషి అన్నారన్న కారణంతో ఈటల రాజేందర్‌పై ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెన్షన్ వేటు వేసింది అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం. అసెంబ్లీలో ఉన్న ఈటల రాజేందర్‌ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి శామీర్‌పేటలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు.

గొంతునొక్కాలని చూస్తున్నారు
ప్రభుత్వ తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బానిసల్లా వ్యవహరించవద్దని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు తీరు దారుణంగా ఉందంటూ రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారని… సంవత్సర కాలంగా కుట్రలు చేస్తూనే ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా తిరిగి గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే గొంతు నొక్కుతున్నారని… టీఆర్ఎస్ పార్టీని గద్దె దించే వరకు విశ్రమించబోనన్నారు. సర్కారు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు ఈటల రాజేందర్.

కేబినెట్ నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేసిన దగ్గర్నుంచి… పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిన టీఆర్ఎస్ హైకమాండ్… చివరకు ఆయన బీజేపీ నుంచి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనా… ఆయనకు కనీస గౌరవ, మర్యాదలు కల్పించడం లేదు. అందుకు ప్రజాక్షేత్రంలోనే టీఆర్ఎస్‌తో అమీతుమీ తేల్చుకుంటానంటూ ఈటల కుండబద్ధలు కొడుతున్నారు.

