NationalNewsNews Alert

ఓల్డ్‌ సిటీపై కేసీఆర్‌ నజర్‌

ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. హైదరాబాద్‌ పాతబస్తీలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్‌ పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోనూ.. తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వొద్దని, శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో రాష్ట్రమంతా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెంచాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తితే కఠినంగా అణిచివేయాలని ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని వదిలేది లేదన్నారు. మత ఘర్షణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు. మతకల్లోలాలు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. ఆందోళనలను ఆరంభంలోనే అణిచేయకుంటే పరిస్థితి అదుపు తప్పుతుందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని విధానంతో ఉందని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని హోం మంత్రి మహమూద్‌ అలీ సూచించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయని.. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 4 గంటల పాటు సాగిన ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొడ పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.