కేసీఆర్ జాతీయ పార్టీ రేపే విడుదల
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ దసరా రోజు విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారనుంది. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని 6వ తేదీన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీ)కి సమర్పిస్తారు. అయితే.. మునుగోడులో వచ్చే నెల జరిగే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫునే అభ్యర్థిని పోటీ చేయించాలని భావిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు జాతీయ పార్టీగా ఈసీ గుర్తింపు ఇచ్చేందుకు కొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 29ఏ-9 సబ్‌క్లాజ్ కింద ఈసీ ఆమోదిస్తే కొత్త పేరు వెంటనే అమల్లోకి వస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని.. ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు ఇప్పటికే తమను సంప్రదిస్తున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్‌ఎస్‌లోకి వస్తారని.. కొందరితో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్ శాఖను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీస ఓట్లు, సీట్లు సాధించాలి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తుందని.. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం కష్టమేమీ కాదని కేసీఆర్ ధీమాతో ఉన్నారు. అవసరమైతే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే సర్వసభ్య సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కలిపి మొత్తం 283 మంది పాల్గొంటారు.

జాతీయ పార్టీ ఏర్పాటుపై మధ్యాహ్నం 1.19 నిమిషాలకు ప్రకటన చేయాలని ముహూర్తం నిర్ణయించారు. తర్వాత పార్టీ ఆశయాలు, లక్ష్యాలను పార్టీ నేతలకు వివరిస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. కాగా.. కేసీఆర్ జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ టీఆర్‌ఎస్ నేత అలిశెట్టి అరవింద్.. ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురి వద్ద కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. జాతీయ పార్టీని ప్రకటించగానే రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆదేశించింది.

