కేసీఆర్.. మా సభను చూడండి
వరంగల్‌లో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను చూడాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆఫర్ ఇచ్చారు. ఈ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన పాదయాత్ర సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరో జాతీయ నేత సునీల్ బన్సల్ ఇప్పటికే వరంగల్ చేరుకున్నారు.

ఓరుగల్లు కాషాయ మయం..
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఓరుగల్లు కాషాయమయం అయింది. ఎటు చూసినా బీజేపీ నేతల ఫ్లెక్సీలు, కాషాయ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. దీంతో వరంగల్‌లో మళ్లీ ఫ్లెక్సీల గొడవ ప్రారంభమైంది. కాగా.. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చించేశారు. ఈ పని టీఆర్‌ఎస్ నేతలదే అని బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నారు.

తన పాదయాత్ర సాయంత్రానికి భద్రకాళీ ఆలయానికి చేరుకుంటుందని, జేపీ నడ్డాతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సభకు వెళ్తామని బండి సంజయ్ చెప్పారు. ఆర్ట్స్ కాలేజీలో సభకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చామని తెలిపారు. అయినా.. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటనలు చేస్తున్నారని, 30 సిటీ యాక్ట్ ఆదేశాల పత్రాలను సీపీ, సీఎం కేసీఆర్ ల్యామినేషన్ చేసుకుని ఆఫీసులో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంపై వచ్చిన లిక్కర్ స్కాం ఆరోపణలను మభ్యపెట్టేందుకే కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

నడ్డాతో నితిన్, మిథాలీ తదితరుల భేటీ
వరంగల్ సభ తర్వాత టాలీవుడ్ నటుడు నితిన్, భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా నడ్డాతో సమావేశం కానున్నారు. వీరి నుంచి స్థానిక పరిస్థితుల సమాచారం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీయార్‌తోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. వీరంతా బీజేపీలో చేరుతున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి కావాల్సింది కూడా అలాంటి ప్రచారమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.