News AlertTelangana

మోదీపై, కేంద్రప్రభుత్వంపై KCR గుస్సా

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం హద్దులు దాటిపోతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. కేసీఆర్ వికారాబాద్ సభలో దేశ ప్రధానిని ఉద్దేశించి అన్న మాటలు చాలా సంచలనం రేపుతున్నాయి. తెలంగాణాకు మోదీయే శత్రువని ప్రకటించడం అంత సులువైన పని కాదు. ప్రపంచం మెచ్చిన ప్రధాని, నాయకుడు, మాటల మాంత్రికుడైన ప్రధానిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ కేంద్రంలో కాంగ్రెస్‌తో జత కడుతున్నాడు. ఒకప్పుడు నరేంద్రమోదీ, కేసీఆర్‌లు స్నేహంగానే ఉండేవారు. మోదీ నోట్లరద్దు ప్రకటించినప్పుడు, జీఎస్టీ విధానం ప్రకటించినప్పుడు మద్దతు తెలిపిన కేసీఆర్ ఇప్పుడు గత ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిందేమీ లేదని, దుర్మార్గపు పాలన చేస్తున్నారని, విమర్శలు గుప్పిస్తున్నారు. రెండవసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినప్పడి నుండీ కేసీఆర్, బీజేపీ తెలంగాణాలో పుంజుకుంటే తమ గతి ఏంటనే భయంతో స్వీయరక్షణ చర్యలు ఆరంభించారు. తెలంగాణా అధికారంలోకి రావాలని ప్రయత్నించడం, దానిని కేసీఆర్ తిప్పి కొట్టడానికి ప్రయత్నించడం జరుగుతోంది. కాంగ్రెస్ తెలంగాణాలో బలహీనపడడం, అదే సమయంలో బీజేపీ పుంజుకోవడం కేసీఆర్‌కు మింగుడు పడని వ్యవహారాలు. రెండు పార్టీల మధ్య నువ్వా- నేనా అన్న పోటీ పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని టీఆర్ఎస్ మొదట ఊహించలేదు. కాలం మారుతూ రాజకీయాలు హాట్‌గా మారుతున్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. కానీ  కేంద్రానికి గల  విశేష అధికారాలు మరిచిపోయారు కేసీఆర్.

కేసీఆర్ భయాలకు కారణం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అనుకోని రీతిలో టీఆర్‌ఎస్ ఓడిపోయి, బీజేపీ గెలవడం, పైగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకోవడంతో పాటు రకరకాల సర్వేలు కూడా బీజేపీ తెలంగాణాలో బాగా పుంజుకుందనే వాదనలు వినిపించడంతో ఆత్మరక్షణలో పడవలసిన పరిస్థితిలో పడింది టీఆర్‌ఎస్. రోకలి మీద పోటులా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజీనామా కారణంగా జరగబోతున్న ఉపఎన్నిక కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీని ఫలితం రాబోయే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేరుగా బీజేపీ పైనా, మోదీ పైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కేసీఆర్.

ఇతర ప్రాంతీయపార్టీలతో జతలు, కూటములు కూడా ఏమీ కలిసిరావడంలేదు. ముందు ఇంటకూడా గెలిచే పరిస్థితి దాటిపోతోంది. దానితో రచ్ఛ గెలవాలన్న ఆలోచనకు తిలోదకాలు ఇవ్వాల్సిందే. దేశ స్థాయిలో మూడో ఫ్రంట్ పెట్టాలన్న కోరిక అటకెక్కింది. ఆ కోపాన్ని బీజేపీ పై వెళ్లగక్కారు కేసీఆర్. ఈ క్రమంలోనే కేంద్రం పనితీరును తీవ్రంగా విమర్శిస్తూ,  తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, తెలంగాణకు నిధులు సరిగా ఇవ్వడం లేదని, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల జాప్యానికి కేంద్రమే కారణమని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను అన్యాయం చేస్తోందని తదితర విమర్శలు చేస్తున్నారు. అయితే బీజేపీ కూడా తెలంగాణా సర్కారుపై సీరియస్‌గానే ఉంది. అప్పుల విషయంలో పట్టు బిగించింది. తన కోపాన్ని బాహాటంగానే వెల్లడిస్తున్నారు కేసీఆర్. మోదీ స్వయంగా వచ్చినా స్వాగతం పలకడం లేదు. మోదీ అధ్వర్యంలో కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. మొత్తానికి కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై, మోదీపై విమర్శల ద్వారా చాలా ప్రమాదం కొనితెచ్చుకున్నట్లవుతోంది. రాబోయే ఎన్నికలే దీనికి సమాధానంగా మారబోతున్నాయి.