NewsTelangana

ధరణితో కేసీఆర్ భారీ స్కామ్: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా  అధికార,ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలతో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఆయన తెలంగాణాలోని 18 లక్షల ఎకరాల భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ ధరణి పోర్టల్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. సామాన్యుల నుంచి భూములను లాక్కోవటానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారన్నారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోనే రూ.18 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఇది మన దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని ఆయన కేసీఆర్‌ను విమర్శించారు. తెలంగాణాలో జరుగుతున్న ఈ భారీ భూకుంభకోణంపై సీబీఐ వెంటనే విచారణ జరపాలన్నారు. కేసీఆర్ ,కేటీఆర్‌కు కలిపి 60 ఎకరాల భూమి మాత్రమే ఉందని 2013లో కేసీఆర్  చెప్పారన్నారు. కానీ ధరణి పోర్టల్‌లో కేసీఆర్ ఫామ్ హౌస్‌లోని 600 ఎకరాల వివరాలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. మరి ఈ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో ఎవ్వరికీ తెలియదన్నారు. కాబట్టి కేసీఆర్ వెంటనే ఈ భూములకు సంబంధించి శ్వేతపత్రం  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్‌లో జరుగుతున్న అవినీతిపై గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్పష్టం చేశారు.