ఈటలను ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా కేసీఆర్ అవమానించారు…రేవంత్
నేటి అసెంబ్లీ సమావేశాలలో ఒక విచిత్రం చోటు చేసుకుంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకప్పుడు తెలంగాణలో మంత్రిగా పనిచేసి, గొప్ప అనుభవమున్న నాయకుడు ఈటల రాజేందర్‌ను ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా కేసీఆర్ అవమానించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వైద్యారోగ్యమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను ప్రగతి భవన్‌లోకి అనుమతించనందుకు కన్నీళ్లతో మీడియా ముందు చెప్పుకున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రగతి భవన్ కేవలం కేసీఆర్ కుటుంబీకులకు మాత్రమే అన్నట్లు ప్రవర్తించారన్నారు. అందుకే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. అప్పటి హోం మంత్రి మహమ్మూద్ అలీని కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదంటూ హోం గార్డు అడ్డుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ఎండలో నిలబెట్టి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, తెలంగాణ సాధించండంలో ముఖ్యపాత్ర వహించిన గద్దర్‌ను కూడా అనుమతించక పోవడం దారుణమన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ప్రగతి భవన్ కంచెలు తీయించామని, తమది ప్రజా ప్రభుత్వమని, సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు ప్రగతి భవన్‌లో ప్రవేశించవచ్చన్నారు ముఖ్యమంత్రి.