మునుగోడుకు ర్యాలీగా కేసీఆర్
మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 3 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్న ఈ ప్రజా దీవెన సభకు 25 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌కు 6 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలోనే మునుగోడుకు వెళ్తున్నారు.

ఆయన వెంట మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు, కార్యకర్తలు వేలాది వాహనాల్లో భారీ ర్యాలీగా వెళ్తున్నారు. ఇందులో వెయ్యి వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద అంబర్‌పేట వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మరో వెయ్యి వాహనాలతో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌తో జతకూడతారు. అక్కడి నుంచి పోచంపల్లి ఎక్స్ రోడ్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడు వరకు ర్యాలీ కొనసాగుతుంది. వివిధ గ్రామాల్లో ర్యాలీలో మరో రెండు వేల వాహనాలు భాగస్వాములవుతాయి. ఇలా సీఎం కేసీఆర్ కాన్వాయ్ 4 వేలకు పైగా వాహనాలతోె మునుగోడులో అడుగు పెట్టనుంది.