పార్టీ నాయకత్వంపై కవిత సంచలన ఆరోపణలు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ పైనే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కవిత అమెరికా నుండి వచ్చిన దగ్గర నుండి తమ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీలో కోవర్టులున్నారని, బీజేపీ పార్టీతో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఏమీ చేయలేక తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. తాను జైలులో ఉన్నప్పుడే బీజేపీ ఇలాంటి ప్రతిపాదన తెస్తే తాను వ్యతిరేకించానని పేర్కొన్నారు. తాను తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా బయటపడిందని ప్రశ్నలు సంధిస్తున్నారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ ఇంటి ఆడబిడ్డనైన తనపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. అప్పట్లోనే తాను రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని ఆగిపోయానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్‌ను తప్ప ఇంకెవ్వరినీ నాయకుడిగా ఒప్పుకోనని చెప్పారు. ఆమె మాటలతో కేటీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడారని అర్థమవుతోంది. తాను 25 ఏళ్ల నుండి తండ్రికి లేఖలు రాస్తున్నానని, వాటిని ఆయన చదివి చించేస్తారని, కానీ ఇప్పుడు ఈ లేఖ ఎలా బయటపడిందన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే.

