Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertPoliticsTelanganaviral

బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ

హైదరాబాద్ : బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరో కీలక మలుపు తీశాయి. పార్టీకి వ్యతిరేకంగా వరుసగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గులాబీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంగా కవిత బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారి అవినీతి మరక నా తండ్రి కేసీఆర్‌కు అంటుకుందని ఆమె భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిని “లిల్లీపుట్” అంటూ విమర్శించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది.
కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా, బీఆర్ఎస్ భవిష్యత్తు బీజేపీతో జోడీ అవుతుందని షాకింగ్ కామెంట్స్ చేయడం కూడా పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం రేపింది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పై చేసిన వ్యాఖ్యలు అధిష్టానాన్ని మరింత ఆగ్రహానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కవితపై వేటు వేసింది. హరీష్‌రావు, కేటీఆర్ ఇప్పటికే ఆమె ఆరోపణలకు బలమైన ప్రతిస్పందన ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి తరపున కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణ అనంతరం ఆమె తదుపరి రాజకీయ నిర్ణయం ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.