Home Page SliderLifestyleNationalNews Alert

నీట్’ లో అదరగొట్టిన కస్తూర్భా విద్యార్థినులు..


దేశంలోనే కష్టతరమైన నీట్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలంటే పెద్ద పెద్ద కాలేజీల్లోనే చదవక్కర్లేదు అని నిరూపించారు ఝార్ఖండ్ లోని ఈ గ్రామీణ అమ్మాయిలు. మావోయిస్ట్ కేంద్రమైన ఖుంటీ జిల్లా కర్రా గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) కు చెందిన విద్యార్థినులు వీళ్లు. తాజా నీట్ ఫలితాల్లో పదకొండు మంది ఈ స్కూల్ నుంచి ఉత్తీర్ణులయ్యారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని కేజీబీవీ స్కూళ్లు అన్నింటితో పోలిస్తే ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి నీట్లో ఉత్తీర్ణత సాధించటం ఇదే తొలిసారి. వీరంతా మొదటి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించటం విశేషం. తమ ప్రతిభకు తోడు… జిల్లా అధికార యంత్రాంగం నిర్వహిస్తోన్న ‘సంపూర్ణ శిక్షా కవచ్’ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందిపుచ్చుకున్నారట ఈ విద్యార్థినులు. ‘వీళ్లందరివీ రైతు కుటుంబాలే. అవకాశాన్ని, గైడెన్సీని చక్కగా వినియోగించుకున్నారు. ఈ ఫలితాలు గ్రామీణ విద్యలో ఓ విప్లవాత్మక మార్పు. భవిష్యత్తులో మరింత మంది అమ్మాయిలు ఇక్కడ చేరటానికి వీళ్లు స్ఫూర్తి’ అంటోంది జిల్లా యంత్రాంగం. ఈ స్ఫూర్తిగా మరింత మంది గ్రామీణ అమ్మాయిలు విజయాలు సాధిస్తారని పేర్కొంటున్నారు.