అనుబంధాలకు ప్రతీకగా జరుపుకునే “కర్వాచౌత్”
భారతదేశం అనేక రకాల సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ అనేక మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఇక్కడ ఉంటారు. వారు, వారివారి సంప్రదాయాలను పాటిస్తూ పండుగలు జరుపుకుంటారు. పండుగలంటేనే పూజలు, వ్రతాలతో పాటు సరదాలు కూడా కలిసి ఉంటాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా జరుపుకునే పండుగలు కొన్నైతే, కేవలం మహిళలు మాత్రమే జరుపుకునే పండుగలు కొన్ని. తమ కుటుంబ శ్రేయస్సును, భర్త ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉత్తర భారతదేశంలో మహిళలు జరుపుకునే పండుగ ఈ కర్వాచౌత్.

ఈవాళ కర్వాచౌత్ పండుగ. అశ్వయుజ పౌర్ణమి తరువాత నాలుగోరోజు జరుపుకునే ఈ పండుగ విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజున తమ కుటుంబసభ్యులు క్షేమంగా ఉండాలని, భర్త ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ మహిళలు ఆ గౌరీదేవిని పూజించి, రోజంతా ఉపవాసం చేస్తారు. పెళ్లి కాని యువతులైతే తమకు మంచిభర్త రావాలని కోరుకుంటూ పూజ చేస్తారు. ఈ వ్రతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ కొనసాగుతుంది. ఈ పండుగరోజు చాలామంది తమ పెళ్లినాటి దుస్తులు ధరించి చేతుల నిండా గాజులు వేసుకుని, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఎక్కువగా ఎరుపు, నారింజ,బంగారు వర్ణ దుస్తులనే ధరిస్తారు. చంద్రోదయ వేళలో తమ భర్త ముఖాన్ని జల్లెడలో దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజు మిగిలిన ఇంటిపనులను చేయరు.

పూర్వం మొఘల్ చక్రవర్తుల కాలంలో హిందూ రాజులు వారిపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు క్షేమంగా తిరిగి రావాలని వారి భార్యలు ఉపవాసం చేస్తూ దీక్ష చేసేవారట. అప్పటి నుండి ఈ సంప్రదాయం మొదలైందని నానుడి. ఈ పండుగరోజు శరదృతువులో పంట చేతికి రాగానే జరుపుకుంటారు. కర్వా అంటే మట్టి కండ అని అర్థం. మట్టి కుండలలో గోధుమలను నింపి పార్వతీ పరమేశ్వరులకు అర్పిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలకు వారి తల్లిదండ్రులు, అత్తింటివారు ప్రత్యేకంగా బహుమతులు అందిస్తారు. ఈ కర్వాచౌత్ పండుగ సంతోషానికీ, అనుబంధాలకూ ప్రతీకగా నిలుస్తోంది.