వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘కలియుగం 2064’..
శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్‌గా, కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కలియుగం 2064 వీక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే భవిష్యత్ అంత అంధకారంగా ఉంటుందా అనే భయం పుడుతుంది. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌లో 2064లో ప్రజలు తిండి, నీరు లేక మనుగడ కోసం పోరాటం చేస్తున్నట్లు అర్థమవుతోంది. హాలీవుడ్ చిత్రాల బాటలో విధ్వంసకరమైన పోరాటాలు భయం కలిగిస్తున్నాయి. ఎటు చూసినా యుద్ధవాతావరణం, తలదాచుకోవడానికి ఇళ్లు కూడా లేకుండా ఎడారిలా మారిన ఊళ్లు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.