కడప స్టీల్ ప్లాంట్ తో వేలాది మంది కి ఉపాధి: సీఎం జగన్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ ఆకాంక్షించారు. జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ సమక్షంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. సున్నపురాళ్లపల్లి వద్ద రూ.8,800 కోట్లతో JSW సంస్థ చేపడుతున్న ప్లాంట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. 24-30 నెలల్లోపు ప్లాంట్ మొదటి ఫేజ్ పనులు పూర్తవుతాయని.. దీని వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందని జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్‌గా ఉందని వెల్లడించారు. 8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తొలివిడతలో 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 30 నెలల్లోపు స్టీల్ ప్లాంట్ తొలి దశ పూర్తవుతుందన్నారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని జగన్ తెలిపారు.