అధికారపార్టీకి అగ్నిపరీక్ష జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
- గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
- మొత్తం ఆరు డివిజన్ లు… ఒక్కో డివిజన్ కు ఒక్కో ఎమ్మెల్యే ఇన్ ఛార్జ్
- మూడు నెలలు నియోజకవర్గానికే పరిమితం కానున్న ఎమ్మెల్యే లు
- కంటోన్మెంట్ లో అనుసరించిన వ్యూహలపై ఆరా
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా తీసుకుంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఓటమి చోటుచేసుకుంటే, పార్టీ ప్రతిష్ఠపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వాసానికి తీవ్రమైన సంకేతంగా మారవచ్చు. ఇలాంటి సందర్భంలో పరిపాలన యంత్రాంగంపై నెగటివ్ అభిప్రాయాలు, నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తే అవకాశముండటంతో — కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికను గెలవడమే లక్ష్యంగా ముందడుగులు వేస్తోంది. అధికారం లో ఉండి ఉపఎన్నికను గెలవక పోతే రాష్ట్రమంతటా దాని ప్రభావం ఉంటుంది.. ప్రజలలో పార్టీ పై విశ్వాసం పోతుంది… కాబట్టి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు మరియు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను నేరుగా రంగంలోకి దింపాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఆరు కార్పొరేట్ డివిజన్లు – యూసుఫ్‌గూడ, బోరబండ, రహమత్‌నగర్, షేక్‌పేట, వెంగళరావునగర్, జూబ్లీహిల్స్ – ఉన్నాయి. ఈ డివిజన్లన్నింటికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్ గా నియమించనున్నట్టు సమాచారం. అదే విధంగా, మొత్తం 360 పోలింగ్ బూత్‌లను మూడు లేదా నాలుగు చొప్పున విభజించి, వాటికి ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించాలన్న ప్రణాళిక రూపొందించారు. ఈ బాధ్యతల కేటాయింపు ప్రక్రియను హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రాథమికంగా సంబంధిత నేతలతో చర్చలు జరిపి, నియామకాలపై ఆలోచనలు పూర్తి చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిశాక ఆయన నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే ఇన్‌చార్జ్‌ల జాబితాను అధికారికంగా ప్రకటించి, వారికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించనున్నారు. అంతేకాక, వీరితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికల వ్యూహాన్ని కూడా సమగ్రంగా తెలియజేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ తొలి వారం లో జరగవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న కానీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యకలాపాల్లో భాగం కాని ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరంతా వచ్చే మూడు నెలలపాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ ని పటిష్టం చేసేందుకు, ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచేందుకు కృషి చేయనున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దృష్టిపెట్టాయి… ఎలాగైనా ఈ ఎన్నికలో గెలిచి కార్యకర్తలలో జోష్ నింపాలని చూస్తున్నాయి…ఒక వేల ఆ రెండు పార్టీలకు అపజయం పలకరించిన పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అధికారంలో లేము కాబట్టి ఉపఎన్నిక గెలవలేకపోయాము అని ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంది… కానీ కాంగ్రెస్ కు అలా కాదు ఖచ్చితంగా ఉపఎన్నిక గెలవాల్సిందే… తరువాత వచ్చే స్థానిక ఎన్నికలు, జీఎచ్ఎంసీ ఎన్నికలలో కూడా గెలవాల్సిందే… ఈ మొత్తం ప్రణాళికను చూస్తే, కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికను తాత్కాలిక అవకాశంగా కాక, నగరంలో తన మున్ముందు రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక దశగా చూస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రయత్నాలు ఎంత మేరకు విజయ సాధిస్తాయో చూడాలి.గ్రౌండ్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంత బాగా పనిచేస్తారన్నదానిపై ఈ విజయం ఆధారపడి ఉంటుంది.