జార్ఖండ్ సీఎం శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కు సిఫార్సు చేసింది. తనకు తానే మైనింగ్ లైసెన్స్ కేటాయించుకున్న అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశారు. దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఈసీ తన నివేదికను గవర్నర్ కు పంపింది. హేమంత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ.. తన నివేదికలో గవర్నర్ కు తెలిపింది. దీంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న హేమంత్ సొరేన్ రాజీనామా చేయాల్సి న పరిస్ధితి ఏర్పడింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ రాంచీ చేరుకున్న తర్వాత సొరేన్ పై అనర్హత వేటును ప్రకటించే అవకాశం ఉంది.

మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కుమారుడైన హేమంత్ సొరేన్ 2009లో రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. ఆ తర్వాత 2013లో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. అదే సంవత్సరం జూన్ లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.2019లో జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున బర్హత్ స్ధానం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యారు. మొత్తం 81 స్ధానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సొరేన్ నాయకత్వంలోని జేఎంఎం పార్టీకి 30 స్ధానాలు ఉన్నాయి. మహా ఘట్ బంధన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఆర్డేడీ, ఎన్సీపీ, సీపీఎం(ఎఁ.ఎల్) మద్దతుతో సొరేన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండో అతి పెద్ద పార్టీగా బీజేపీ ఉంది. ఆ పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చే.యాలని శతవిధాలా బీజేపీ ప్రయత్నించి విఫలమైంది. ఈక్రమంలో హేమంత్ సోరెన్ పేరు మీద గనుల తవ్వకం లీజు ఉందంటూ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ గతంలో అనేక ఆరోపణలు చేశారు. దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ రమేశ్ బైస్ ను కలిసి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై విచారణ జరిపిన ఈసీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది.

మొదట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం ఓ నోటీసు ఇచ్చింది. సోరెన్‌కు మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ పత్రాలన్నిటినీ పరిశీలించిన తర్వాత సోరెన్‌కు కూడా నోటీసులు పంపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ధర్మాసనం సమక్షంలో బీజేపీ, సోరెన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోరెన్ తరపు న్యాయవాదుల వాదనలు ఈనెల 12తో ముగిశాయి. వారంరోజుల తర్వాత కమలనాధులు ఓ రిజాయిండర్‌ను సమర్పించారు. అన్నింటినీ పరిశీలించిన ఈసీ సొరేన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సిఫార్సు చేసింది. దీంతో ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాలు వేడ్డెక్కాయి. తర్వాత ఏం జరగబోతోంది అన్న అంశాలపై అంతా దృష్టి పెట్టారు. జేఎంఎం కూడా తన భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతోంది.
అది ఎన్నికల సంఘం నివేదిక కాదు.. బీజేపీ చేసిన సిఫార్సు :సొరేన్
ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్లుగా చెబుతున్న అంశానికి సంబంధించి ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు జార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్. ఆ నివేదిక తయారు వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఇందులో బీజేపీ ప్రధాన భాగస్వామి అని అన్నారు.


 
							 
							