InternationalNews Alert

నకిలీ వ్యోమగామి మాయాజాలంతో జపాన్ మహిళకు టోకరా

మోసాలు చేసే ఘరానా మోసగాళ్ల చేతిలో అమాయకులు మోసపోతూనే ఉన్నారనే దానికి సరైన ఉదాహరణ ఈ సంఘటన. జపాన్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు సామాజిక మాధ్యమంలో ఓ వ్యక్తి పరిచయమై తాను రష్యాకు చెందిన వ్యోమగామినని నమ్మించాడు. అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో పని చేస్తున్నట్లు నకిలీ ఫొటోలను కూడా పంపాడు. తరచూ మెసేజ్‌లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. నీపై మనసు పడ్డానని, భూమ్మీదకు రాగానే పెళ్లిచేసుకుంటానని మాయమాటలతో నమ్మించాడు. తనకు తిరిగి రావాలంటే డబ్బు కావాలని, జపాన్‌కు వెళ్లే రాకెట్‌కు ల్యాండింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. అతని మాటలను నమ్మిన ఆమె, 5 సార్లు అతని ఖాతాకు 4.4 మిలియన్ యెన్‌లు (దాదాపు 24 లక్షల రూపాయలు ) పంపించింది. మరింత డబ్బు అడగడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో అతని రంగు బయటపడింది. అతడు నకిలీ వ్యోమగామి అని తేలింది. దీనికి అంతర్జాతీయ రొమాన్స్ స్కామ్‌గా పేరుపెట్టి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నమ్మేవాళ్లుంటే చెప్పేవాళ్లు ఎలాంటి మాటలైనా చెప్తారు కదూ…