జనసేన పార్టీని లైట్ తీసుకుంటే వైసీపీకి భారీ నష్టమే?
◆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటితో మారిన రాజకీయ వాతావరణం
◆ వారిద్దరి కలయికతో వైసీపీలో మొదలైన ఆందోళన
◆ అధికార పీఠం ఎక్కాలంటే గోదావరి జిల్లాలే టార్గెట్
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు ప్రజల్లోనే ఉంటూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో భేటీ కావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వారిద్దరూ కలయికతో కొంతమేర వైసీపీలో ఆందోళన మొదలైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో. రాజకీయాల్లో ఆయన చేసేది ఏమీ లేదు ఎపుడో ఒకసారి వచ్చి మీటింగులు పెట్టి వెళ్లిపోతారని వైసీపీ పార్టీ అనుకున్నా జనసేన పార్టీ ఉనికిని లైట్ తీసుకున్నా కూడా ఈసారి భారీ నష్టం తప్పదని వైసీపీకి చాలా బాగా అర్ధమవుతోందట. పవన్ 2019 నాటి మనిషి కాదు అన్నది వైసీపీకి అందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయట. అధికార పార్టీకి అతి పెద్ద రెడ్ సిగ్నల్ ఏపీలో బలమైన సామాజిక వర్గం నుంచే వస్తోంది అంటున్నారు.

కాపులు ఏపీలో ఈసారి తన తడాఖా చూపిస్తారని విశ్లేషకులు అంటున్నారు. దేశానికి స్వాత్రంత్రం వచ్చిన తరువాత కాపులు ఏపీలో సీఎం పీఠాన్ని అధిరోహించలేకపోయారు. ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ వారు చేసిన ఎన్నో ప్రయత్నాలు వమ్మయ్యాయి. అయితే ఈసారి సీన్ అసలు వేరేలా ఉంటుందని అంటున్నారు. కాపులు ఈసారి ఎలాగైనా పవన్ ని కోసం గట్టిగా నిలబడతారని అంటున్నారు. ఈ మేరకు కాపుల్లో పవన్ మానియా బాగానే ఉందని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి అధికార పార్టీకి అందుతున్న సమాచారం. దీన్ని బట్టి చూస్తే గోదావరి జిల్లాలు మొత్తానికి మొత్తం జనసేనకు టర్న్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. నిజానికి ఏపీ రాజకీయాలను శాసించేవి ఈ జిల్లాలే అంటున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా 2019 ఎన్నికల్లో జగన్ పవర్ లోకి వచ్చినా కూడా కాపుల మద్దతు వారిని దండీగా లభించబట్టే అని ఈసారి చూస్తే మాత్రం కాపులంతా పోలరైజ్ అవుతున్నారని అంటున్నారు.

ఈసారి కాకపోతే మరెప్పుడూ అన్నట్లుగా కాపుల్లో చర్చగా వస్తోందట. ఇంత పెద్ద ఎత్తున జనాభా ఉండి కూడా కాపులకు ముఖ్యమంత్రి పదవి అందని పండుగా ఉండడమేంటన్న ఆవేదన వారిలో ఉందట. దాంతో కాపులు పవన్ చుట్టూ ర్యాలీ అవుతున్నారన్న నివేదికలు అధికార పార్టీని తెగ కలవరపెడుతున్నాయి. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కాపులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ మొత్తం సీట్లు కలుపుకుని 68 దాకా ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు జనసేన కొల్లగొడితే అధికారంలోకి వైసీపీ తిరిగి రావడం కష్టమే అవుతుంది అంటున్నారు. దాంతో ఇప్పటి నుంచే మేలుకోవాలని వైసీపీ డిసైడ్ అయీనట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే వైసీపీకి చెందిన కీలక నాయకులు సమావేశమయ్యారు. వారంతా కాపులు వైసీపీకి దూరం కావడం మీదనే చర్చించారు.

అతి పెద్ద జనాభా దూరమైతే వచ్చే ఎన్నికల్లో నెగ్గుకువచ్చేదెలా అన్నదే ఈ సమావేశంలో చర్చకు వచ్చిందంటున్నారు. మరి రానున్న ఎన్నికల నాటికి కాపులను అక్కున చేర్చుకోవడానికి వైసీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు… పవన్ కళ్యాణ్ ని ధీటుగా ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో మరల అధికార పీఠం కైవసం చేసుకోవడానికి ఎలాంటి వ్యవహారాలు అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

